ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది. గాల్లో బెలూన్లు వేలాడుతున్నట్టుగా.. జీ ఫర్ గూగుల్ అనే అక్షరాలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు డ్యూడుల్ ను రూపొందించారు.
ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో అందించే ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగల్. కామ్ నేడు 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
వివరాలలోకి వెళితే, 1995లో ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ లు స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో కలుసుకున్నారు. వారు 1996లో బ్యాక్ రబ్ పేరుతో సెర్చ్ ఇంజిన్ ను ప్రారంభించారు. తరువాత ఈ సెర్చ్ ఇంజిన్ కు గూగుల్ గా పేరు పెడుతూ 1997 సెప్టెంబర్ 15న వెబ్ సైట్ ను రిజిస్టర్ చేశారు. కాగా, గూగుల్ అనే పదం googol అనే పదం నుంచి వచ్చింది. googol అనేది ఓ సంఖ్య పేరు. ఈ సంఖ్యలో 1 తర్వాత వంద సున్నాలు ఉంటాయి. ఇలా గూగుల్ తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు దిగ్గజంలా నిలిచింది.
మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్ లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది.