రాజమౌళి రూపొందించిన అద్భుతం ‘బాహుబలి’ముందు ఆ తర్వాత విడుదలై బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా నిలవలేకపోయాయి. కనీసం బాహుబలి హిందీ వెర్షన్ సెట్ చేసిన టార్గెట్ ను కూడా రీచ్ కాలేకపోయాయి. ఈ క్రమంలో బాహుబలిని మించిన సినిమా తీయాలనే తపన బాలీవుడ్‌లో మొదలైందనడంలో సందేహం లేదు.. అమీర్ ఖాన్ ఇప్పటికే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా ద్వారా అలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టాడని టాక్.. తాజాగా అజయ్ దేవగణ్ హీరోగా ‘తానాజీ’ గా రూపుదిద్దుకుంటోంది.. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాఫస్ట్ లుక్ కూడా విడుదలై అంచనాల్ని పెంచేసింది.
మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నఈ సినిమాలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి’ సినిమాతో పోటీపడటం లేదని, అయితే, ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో తెరకెక్కించాలని మాత్రం అనుకుంటున్నామని అన్నారు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని చూస్తున్నామని, మనం తీసే చిత్రాల్లో భావోద్వేగాలు, నాటకీయత మొదలైనవి ఎక్కువగా ఉండాలని అన్నారు. అలా తీయలేని పక్షంలో మన సినిమాలను హాలీవుడ్ సినిమాలు భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాహుబలి స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. 2019లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం అజయ్ నటించిన `బాద్‌షాహో` సినిమా సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది.