గణేష్ ఉత్సవాలు మన దేశంలో ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే ఒక్కో ప్రాంతంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేషుడికి, లడ్డూకి ఉన్న క్రేజే వేరు. అందుకే కొన్ని లక్షల మంది భక్తులు ఆ మహాగణపతిని దర్శించుకుంటారు. చివరకు నిమజ్జన కార్యక్రమం కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
నిమజ్జనం తరువాత రెండు, మూడు రోజులకు ఆ గణపతి ప్రసాదమైన భారీ లడ్డూను అందరికీ పంచి పెడతారు. అయితే ఈ సారి లడ్డూ ప్రసాదం ఉండడం లేదు. అవును, మీరు విన్నది నిజమే.
ఖైరతాబాద్ మహా గణపతి లడ్డూ ప్రసాదాన్ని ఈ సారి మాత్రం అందివ్వడం లేదట. ఎందుకంటే…గతేడాది లడ్డూ పంపిణీ వాటాలో ఉత్సవ కమిటీ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వివాదం తలెత్తింది. కాగా గణపతి లడ్డూని భక్తులకు పంచే క్రమంలో కూడా తీవ్ర సమస్యలు ఎదురవుతండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఈ సారి లడ్డూ ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రతి ఏటా ఈ గణేషుడి కోసం లడ్డూను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి తెప్పిస్తారు. అక్కడే లడ్డూను తయారు చేస్తారన్న విషయం తెలిసిందే.
మొత్తానికి..లడ్డూ లేకపోతే ఎలా అని భావించిన ఉత్సవ కమిటీ సభ్యులు అచ్చం ఆ లడ్డూలానే ఉండే ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన మోడల్ లడ్డూను గణపతి వద్ద పెట్టునున్నారు. అంటే..ఈ ఏడాది జరిగే వినాయక చవితి రోజున ప్రతిష్టించబోయే ఖైరతాబాద్ గణపతి వద్ద పెట్టబోయేది బొమ్మ లడ్డూ అన్నమాట. హతవిధీ..!