పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అప్‌కమింగ్ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కి, ట్రైలర్‌కి భారీ స్పందన కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్‌లో కనిపించిన బూతు డైలాగ్స్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేశాయి. ఇన్ని బూతు డైలాగ్స్‌తో ఈ సినిమా సెన్సార్ స్టేజ్ దాటుతుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. కాకపోతే ఎలాగోలా కొన్ని కట్స్‌తో సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ అవనుంది. ఈ సంధర్బంగా అర్జున్ రెడ్డి టీం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే ఓ పోస్టర్ మాత్రం మరీ అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు.
వివరాల్లోకెళితే.. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో జరిగిన సమావేశానికి వీహెచ్ హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఓ ఆర్టీసీ బస్సు మీద నటుడు విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఓ అసభ్యకరమైన పోస్టర్‌ను ఆయన గమనించారు. బస్సు ఆపించి కండక్టర్ సాయంతో పోస్టర్‌ను తొలగించేశారు హనుమంతరావు. ఇలాంటివి యువతను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని ఈ సందర్భంగా వీహెచ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో బస్సులపై ఉన్న అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లను వీహెచ్ చించేశారు. వీహెచ్ పోస్టర్ చింపేస్తున్న ఫొటో వైరల్ అవగానే పోస్టర్‌లోని అర్జున్ రెడ్డి సినిమా నటుడు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘చిల్ తాతయ్యా’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశాడు.