ప్రస్తుత రోజుల్లో బయోపిక్స్ ఏ తరహాలో తెరకెక్కుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలీవుడ్ లో బయోపిక్స్ కి అయితే కొదవలేదు. చరిత్రలో ఒక్క పేజీ ఉన్న వ్యక్తి అయినా చాలు ఆ వ్యక్తి తాలూకు జీవితాన్ని వెండి తెరపై చూపించడానికి ఎంతో కృషి చేస్తారు. అందుకు అగ్ర నటులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. మేరి కోమ్.. దంగల్.. సారబ్జిత్ సినిమాలు అలా వచ్చినవే. ఇక టాలీవుడ్ లో కూడా అప్పుడపుడూ బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా అదే స్థాయిలో తెరకెక్కుతోంది.
అయితే ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురించి తెలియని వాళ్లుండరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర .. సాధించిన విజయం మరిచిపోలేనివి. పట్టుదలకు .. కార్యదీక్షకు .. సమయస్ఫూర్తికి ప్రతీకగా కేసీఆర్ పేరు చెబుతారు. అలాంటి కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత-దర్శకుడు మధుర శ్రీధర్ కేసీఆర్ బయోపిక్ ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నానని చాలా కాలం క్రితమే ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ బయోపిక్ లో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కేసీఆర్ పాత్రతో అలరించనున్నాడట. మధుర శ్రీధర్ అప్పట్లో కేసీఆర్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అయితే బయోపిక్ కథను రీసెంట్ గా నవాజుద్దీన్ సిద్దిఖీ కి చెప్పడంతో ఆయన కూడా ఒకే అన్నారట. కాకపోతే ఓ మీడియా సమావేశంలో కేసీఆర్ బయోపిక్ ప్రస్తావన రాగానే సిద్దిఖీ మాత్రం.. ఇంకా అలాంటి చర్చలు జరగలేదని.. ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం ఆలోచించకుండా తప్పకుండా చేస్తాను అని బదులివ్వడం అందరిలో ఆసక్తిని రేపుతోంది.