భారత బౌలర్ల ధాటికి లంకేయులు బెంబేలెత్తిపోయారు. అర్జున రణతుంగ, అరవింద్ డిసిల్వా, జయసూర్య, చమిందావాస్, ముత్తయ్యమురళీ ధరన్, మార్వాన్ ఆటపట్టు, ఉపుల్ తరంగ, కుమార ధర్మసేన, దిల్షాన్, జయవర్థనే, సంగక్కర వంటి దిగ్గజాలు ఆడిన లంక జట్టేనా అన్నంత దారుణమైన ప్రదర్శనతో లంకేయులు అభిమానులను నిరాశపరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే చేజార్చుకున్నారు. 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
తాజాగా పల్లెకెలె టెస్ట్ లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఇన్నింగ్స్171 పరుగులు తేడాతో మూడో టెస్ట్ గెలిచి టెస్ట్ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 181కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది శ్రీలంక. కరుణ రత్నే (17) ,కుశాల్ మెండిస్ (12), పెరీరా (8)లు తక్కువస్కోరుకే ఔటయ్యారు. మిగతవాళ్లు కూడా సింగిల్ డిజిట్‌కే ఔటవడంతో శ్రీలంక ఓటమి ఖాయం అయింది. చండిమాల్ (36), మాథ్యూస్ (35) ,డిక్ విల్లా (41)లు కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అశ్విన్, షమి దెబ్బకు ఫలితం లేకుండా పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4 వికెట్లు, షమి 3 వికెట్లు, ఉమేష్ 2 వికెట్లు, కుల్‌దీప్ 1 వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 487 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది.