న్యూఢిల్లీ: జాతీయ సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లాజ్ నిహలానీపై వేటు పడింది. సీబీఎఫ్‌సీ పదవినుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ శుక్రవారం ఆదేశించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. విద్యాబాలన్‌తో పాటు తెలుగు హీరోయిన్లు గౌతమి, జీవితలకు కూడా సెన్సార్ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది.
నూతన సభ్యుల్లో గౌతమి, నరేంద్ర కోహ్లి, నరేశ్ చంద్రలాల్, నీల్ హెర్బర్ట్, వివేక్ అగ్నిహోత్రి, వామన్ కేంద్ర, విద్యాబాలన్, టీఎస్ నాగభరణ, రమేశ్ పతంగి, వాని త్రిపాఠి, జీవితా రాజశేఖర్, మిహిర్ భూటాలు ఉన్నారు. ఇన్నాళ్లూ పెహలజ్ నిహలనీ అత్యంత వివాదాస్పద సీబీఎఫ్‌సీ చీఫ్‌గా కొనసాగారు. రెండున్నర ఏళ్లు సీబీఎఫ్‌సీ చీఫ్‌గా నిహలానీ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ సమయంలో ఆయన స్టయిల్లో ఫిల్మ్ సెన్సార్ సర్టిఫికెట్లు ఇచ్చారు. స్పెక్టర్ ఫిల్మ్‌లో కిస్ సీన్‌ను కట్ చేసిన తర్వాత ఆయనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తర్వాత ఉడ్తా పంజాబ్‌లో దాదాపు 89 కట్‌లు చేశాడు. ఆయన్ను తొలిగించడంతో బాలీవుడ్ సంబరాలు చేసుకుంటున్నది. జూలై చివర్లోనే నిహలానీని తప్పిస్తారని కేంద్రం సంకేతాలిచ్చింది. సీబీఎఫ్‌సీ కమిటీలో నిర్మాణాత్మక మార్పులు జరగనున్నాయని ఇటీవలే సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఎంపికైన దర్శక, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు.