రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్… ఇటీవలే ఈ ఫోన్‌ను ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ ఫోన్ కోసం ప్రీ బుకింగ్ ప్రారంభించనున్నారు. అనంతరం ముందుగా బుక్ చేసుకున్న వారికి ఫోన్లను అందజేయనున్నారు.ఆ ఫోన్ ధర రూ.0 అని మాత్రమే నిర్దారణ అయింది. ఇందుకు రూ.1500లను సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్నారు. అయితే 3 ఏళ్ల తరువాత ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని ప్రకటించడంతో మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. అయితే జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమైన ఎయిర్‌టెల్.. 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. తద్వారా 4జీ వోల్టే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి జియోకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
ఇక ఎయిర్ టెల్ జీయో కన్నా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్ అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ధర రూ. 1000 ఉంటుందని సమాచారం. జియోతో పోటీని ఎదుర్కోవాలంటే, అదే వ్యూహం తప్పదని భావిస్తున్న ఎయిర్ టెల్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు టెలికం వర్గాల సమాచారం. అయితే, రిలయన్స్ మాదిరిగా ఈ మొత్తాన్ని కొన్నాళ్ల తరువాత తిరిగి ఇస్తారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు.