3 అంశాలపై తెలుగు చంద్రుల ఏకాభిప్రాయం

252
- Advertisement -

కృష్ణా జలాలపై ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రధానంగా 3 అంశాల ఏకాభిప్రాయానికి వచ్చామని కేంద్రమంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఇరు రాష్ర్టాలు ఈ భేటీలో తమ వాదనలను వినిపించాయని పేర్కొన్నారు. నది జలాల సమస్య పరిష్కారానికి  ఏపీ,తెలంగాణ అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్రానికి చెందిన అధికారులు కమిటీలో ఉంటారని…నీటి లభ్యతపై వివరాలను కమిటీ అందిస్తుందని తెలిపారు.

apex-tsap

అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ర్టాలు అంగీకారం తెలిపాయని వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రల వివాదంపైనా భేటీలో చర్చించినట్లు తెలిపారు. నదీ జలాల పంపిణీ విషయంలో వివాదాల పరిష్కారానికి మార్గం గురించి ఆలోచించామని పేర్కొన్నారు.

apex-tsap
నదీలో నీటి లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలు నీటిని పంచుకోనున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఇరు రాష్ర్టాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమస్యలను వివరించాయని వెల్లడించారు. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని….తుది నివేదిక వచ్చిన తర్వాత ట్రైబ్యునల్ సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. నది జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు.

- Advertisement -