పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఉసిరి, బిల్వం మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఆలయంలో, ప్రతి పాఠశాలలో ఉసిరి, బిల్వం మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. భక్తిభావాన్ని ప్రకృతి పరిరక్షణతో మేళవించడం, మన సంప్రదాయ వృక్ష సంపదను భావితరాలకు అందించడమే ఈ హరిత సంకల్పం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంతోష్ కుమార్ కీసరగుట్టకు వచ్చి స్వామివారికి అభిషేకం నిర్వహించి ఉసిరి, బిల్వం మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. నాటిన మొక్కలను పూర్తి బాధ్యతతో సంరక్షిస్తామని వెల్లడించారు.

ఐదో ఏడాది కొనసాగుతున్న హరిత సంకల్పం
కార్తీకమాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఉసిరి చెట్టుతో పాటు శివారాధనలో విశిష్ట స్థానం కలిగిన బిల్వ వృక్షాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం’ నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వరుసగా ఐదో ఏడాది విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తి, పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
Also Read:ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే..‘భోగి’!
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేష్ శర్మ, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

