వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, ఇంకా 500 రోజులే మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2028లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్లో నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన పలువురు మేధావులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి ఎన్నో రూపాల్లో విస్తరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారని పేర్కొన్నారు. పనులు కావాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రేవంత్ రెడ్డి సోదరులు వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజాపాలన కంటే పర్సంటేజీల పాలనే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యా వ్యాపారాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో వరంగల్‌లో సంక్షేమం, అభివృద్ధి కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త టెక్స్టైల్ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని ఆరోపించారు. 90 శాతం పూర్తయిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మిగిలిన 10 శాతం పనులను కూడా మూడేళ్లలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఫ్యూచర్ సిటీ గురించి ప్రచారం చేసుకోవడం కంటే ఇప్పటికే భవిష్యత్తుకు అవకాశాలున్న వరంగల్ నగరంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చి ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదన్నారు. వరంగల్‌ను భవిష్యత్తులో ప్రధాన ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని ప్రకటించారు.
Also Read:ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే..‘భోగి’!
ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, బాల్క సుమన్, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడే నాగజ్యోతి, సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి, పెద్ది స్వప్న రెడ్డి తదితరులు హాజరయ్యారు.

