BB10:నీతూ ఎలిమినేషన్

5
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నీతూ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డిక్టేటర్స్ థీమ్‌తో ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన పోటీలు, గొడవలు, టాస్కులు సాగాయి. ముఖ్యంగా త్రిగుణ్ తన టీమ్‌ను సమర్థంగా నడిపించి డిక్టేటర్‌గా మంచి మార్కులు సంపాదించాడు. ఇక ఆదివారం జరిగిన సండే ఫండే ఎపిసోడ్‌లో నీతూ ఎలిమినేట్ కావడంతో 11వ వారం ముగిసింది. మరోవైపు 12వ వారం బడ్డీ అప్ థీమ్‌తో సాగనుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

బిగ్ బాస్ డే 77, ఎపిసోడ్ 78లో భాగంగా కంటెస్టెంట్లను జంటలుగా విడగొట్టి వివిధ టాస్కులు నిర్వహించారు. వీటిలో గెలిచిన వారికి 12వ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం కల్పించారు. ఈ పోటీల్లో త్రిగుణ్, ఆర్కే, శివ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముకేష్ విజయం సాధించి కెప్టెన్సీ రేసులో నిలిచారు.

మొదట దేబ్జానీ, త్రిగుణ్ సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత వంశీ, త్రిగుణ్ మధ్య రోప్ టాస్క్ నిర్వహించారు. దాదాపు ఎనిమిది నిమిషాలకు పైగా ఇద్దరూ పోటీపడగా చివరకు వంశీ గివ్ అప్ ఇచ్చాడు. దీంతో త్రిగుణ్ విజయం సాధించాడు. ఈ టాస్కులో ఇద్దరి పట్టుదలను నాగార్జున ప్రశంసించారు.

Also Read;ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే..‘భోగి’!

మైసా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశారు. సినిమా డైలాగులను గుర్తించడం, డ్యాన్స్ చేయడం వంటి ఫన్నీ గేమ్స్‌తో కంటెస్టెంట్లను అలరించారు. ముకేష్ కన్నడలో రష్మికతో మాట్లాడగా, శివ్ సైతం ఆమెను కన్నడలో పొగిడాడు. అనంతరం రష్మిక చేతుల మీదుగా ముకేష్, వంశీ సేఫ్ అయ్యారు.

మరోవైపు రామ్ ప్రసాద్, నరేష్ మధ్య జరిగిన టాస్కులో నరేష్ గెలిచాడు. శివ్, అమన్ మధ్య జరిగిన టాస్కులో శివ్ విజయం సాధించాడు. దేబ్జానీ, నీతూ మధ్య జరిగిన గేమ్‌లో దేబ్జానీ గెలిచింది. సుధీర్, ఆర్కే మధ్య జరిగిన పోటీలో ఆర్కే విజయం సాధించాడు. ఈ సందర్భంగా తొలిసారి గెలిచానంటూ ఆర్కే చేసిన హంగామా నవ్వులు పూయించింది.

చివరిగా నీతూ, సుధీర్ ఎలిమినేషన్ ప్రక్రియలో మిగిలారు. ఇద్దరికీ కళ్లకు గంతలు కట్టి గార్డెన్ ఏరియాలోని కారులో కూర్చోబెట్టారు. సుధీర్ తిరిగి వస్తాడని కొందరు, నీతూ ఎలిమినేట్ అవుతుందని మరికొందరు అంచనా వేశారు. చివరకు సుధీర్ ఇంట్లోకి తిరిగి రాగా, నీతూ ఎలిమినేట్ అయింది.

- Advertisement -