భారతదేశంలో మత్స్య సంపద ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. గత 25 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తి ఏకంగా 250 శాతం వృద్ధి సాధించింది. 2000-01 ఆర్థిక సంవత్సరంలో కేవలం 56 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి.. 2024-25 నాటికి 197 లక్షల టన్నులకు పైగా చేరింది. కేంద్ర మత్స్యశాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా దేశంలో మత్స్య రంగం సాధించిన ప్రగతికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
గత ఏడు దశాబ్దాలుగా భారతదేశ మత్స్య రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు సముద్రాలపై ఆధారపడిన చేపల వేటే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. అంతర్గత జల వనరులు, చెరువులు, రిజర్వాయర్లు, నదులు, ఆక్వాకల్చర్ ద్వారా చేపల పెంపకం విస్తృతంగా పెరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన చేప పిల్లల ఉత్పత్తి, సాగు పద్ధతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
2024-25 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం చేపల ఉత్పత్తి 197.75 లక్షల టన్నులకు చేరింది. ఇందులో అంతర్గత జల వనరులు, ఆక్వాకల్చర్ ద్వారా 151.60 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి కాగా.. సముద్ర మత్స్య రంగం ద్వారా 46.15 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదైంది. అంటే దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో అంతర్గత మత్స్య రంగం వాటా 76 శాతానికి పైగా ఉంది.
రాష్ట్రాల వారీగా చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25లో ఆ రాష్ట్రం మొత్తం 55.39 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేసింది. ఇందులో 48.88 లక్షల టన్నులు అంతర్గత జల వనరుల ద్వారా 6.51 లక్షల టన్నులు సముద్ర మత్స్య రంగం ద్వారా వచ్చాయి. పశ్చిమ బెంగాల్ 23.74 లక్షల టన్నులతో రెండో స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ 13.31 లక్షల టన్నులతో తర్వాతి స్థానంలో నిలిచింది. ఒడిశా 11.92 లక్షల టన్నుల ఉత్పత్తితో మరో కీలక రాష్ట్రంగా నిలిచింది.
Also Read:హనుమాన్ అన్ష్ హిట్ కానీ..దర్శకుడు మాత్రం!
చేపల ఉత్పత్తి పెరుగుదలతో దేశీయ మార్కెట్లో సరఫరా మెరుగుపడటమే కాకుండా, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు కూడా అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఆధునిక సాగు విధానాలు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడితే రానున్న రోజుల్లో భారత మత్స్య రంగం ప్రపంచ మార్కెట్లో మరింత కీలక స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది.

