బాలీవుడ్ చిత్రం ‘రామాయణ్’ విడుదలతో కేరళంలోని జటాయు ఎర్త్ సెంటర్ మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడ ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జటాయు ఎర్త్ సెంటర్ను సందర్శిస్తారని, అనంతరం ప్రధాని మోదీ పర్యటన ఉండవచ్చని ఆయన తెలిపారు.
రెండు రోజుల క్రితం గజేంద్ర సింగ్ షెకావత్.. జటాయు ఎర్త్ సెంటర్ రూపకర్త, దర్శకుడు రాజీవ్ అంచల్ను కలిశారని సురేశ్ గోపి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న బినాలే ప్రదర్శనలో జటాయు శిల్పాన్ని ప్రదర్శించాలనే ఆసక్తిని షెకావత్ వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
కేరళంలోని కొల్లం జిల్లాలో చడయమంగళం గ్రామంలో జటాయు ఎర్త్ సెంటర్ ఉంది. దీనినే జటాయు నేచర్ పార్క్ అని కూడా పిలుస్తారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జటాయు పక్షి శిల్పం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా ఇది గుర్తింపు పొందింది. ఈ భారీ శిల్పం, పార్కు నిర్మాణానికి సుమారు పదేళ్ల సమయం పట్టింది.
రామాయణం ప్రకారం.. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తున్న సమయంలో జటాయు అతడిని అడ్డుకున్నాడు. సీతను రక్షించేందుకు రావణుడితో భీకరంగా పోరాడాడు. అయితే ఈ యుద్ధంలో రావణుడి చేతిలో ఓడిపోయి చడయమంగళంలోని పర్వత శిఖరంపై పడిపోయాడు. అనంతరం శ్రీరాముడికి సీతాపహరణం గురించి సమాచారం అందించి అక్కడే ప్రాణాలు విడిచాడని పురాణ గాథ చెబుతుంది. జటాయు శిల్పాన్ని కూడా ఆయన ప్రాణాలు విడిచిన ప్రదేశంలోనే ఏర్పాటు చేసినట్లు స్థానిక కథనం.
Also Read:రాజీనామా చేస్తే..తప్పు చేసినట్లు కాదు!

