మియాపూర్ భూముల వివాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు గెలిచామని, మియాపూర్‌లోని 550 ఎకరాల భూములు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఈ భూముల్లో గత 25 ఏళ్లుగా చట్టబద్ధంగా అనేక కాలనీలు, నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు.
మధ్యతరగతి కుటుంబాలు సరైన సేల్ డీడ్ల ద్వారా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇళ్లను కొనుగోలు చేశాయని రామచందర్ రావు తెలిపారు. అలాంటి ఇళ్లు, కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాల ఇళ్లను, నివాస ప్రాంతాలను కూల్చివేయడం లేదా ఇబ్బందులకు గురిచేయడం చేయకూడదని స్పష్టం చేశారు.
మిగిలిన 400 ఎకరాలకు పైగా భూమిని స్థానిక ప్రజల అవసరాల కోసం ఓపెన్ స్పేస్‌గా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున మరో కాంక్రీట్ జంగిల్‌ను సృష్టించకూడదని సూచించారు.
Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్
ఈ భూములను వేలం వేయడం కంటే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ప్రభుత్వానికి సూచించారు. స్థానికులకు ఉపయోగపడేలా పార్కులు, ఆటస్థలాలు, ఆసుపత్రి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగరాభివృద్ధితో పాటు ప్రజల అవసరాలు, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని రామచందర్ రావు పేర్కొన్నారు.

