సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సినీ నటి గోగినేని అనిత సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేస్తామని నమ్మించిన కేటుగాళ్లు ఆమె నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న సినీ నటి గోగినేని అనిత తన కుమారుడి పుట్టినరోజు వేడుకల కోసం అమెరికాలోని వాషింగ్టన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్ల బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికారు. ఈ విషయాన్ని గుర్తించిన సైబర్ నేరగాళ్లు ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థ ప్రతినిధులమంటూ ఆమెను సంప్రదించారు.
రాజేష్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడి బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని తెలిపాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన అనిత తన డెబిట్ కార్డు వివరాలను అందించారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కోసమేనని భావించి వచ్చిన ఓటీపీని కూడా అతడికి చెప్పారు.
Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్
దీంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ‘క్లియర్ ట్రిప్’ పేరిట రూ.4,14,180 నగదు కట్ అయింది. అయితే డబ్బులు చెల్లించినప్పటికీ విమాన టికెట్ బుకింగ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు అందలేదు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన అనిత పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

