తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు కరువుతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భారత్ సమ్మిట్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కరువు పరిస్థితుల్లో కొడంగల్ నియోజకవర్గానికి రూ.9 వేల కోట్లు కేటాయించడం అవసరమా? రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే ఉందా? అని నిలదీశారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, పాలకులు తెచ్చిన వికృతి కరువని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణా నదిలో 250 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, అయినప్పటికీ పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు ప్రాంతానికి నీళ్లు అందడం లేదని, అదే సమయంలో నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వెళ్తున్నాయని నిలదీశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో మూసీ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. బియ్యం, కూరగాయల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సుందరీకరణ పనులు ఇప్పుడు అవసరమా? అని నిలదీశారు. రైతులకు కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కరువు సాయం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆరోపించారు.
తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ 8 వేల ఎకరాలు ఆక్రమించుకున్నానని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎక్కడ నిరూపించారని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రికి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై మరోసారి విమర్శలు గుప్పించిన కేటీఆర్.. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని అన్నారు. నోటికి వచ్చినట్లుగా అడ్డగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పూర్తిగా రాహుల్ గాంధీకి బాడీగార్డ్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు కూడా చిన్నపిల్లాడిలా ఉరుకుతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాత్రపై కూడా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ పెట్టిన దయాభిక్ష కాదని, కోట్లాది మంది ప్రజల పోరాటం, త్యాగాల ఫలితంగా ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు.

