పాన్ ఇండియా మూవీ.. ‘మైసా’

4
- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మైసా’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘ఓ మైసా రే’లో రష్మిక చాలా పవర్‌ఫుల్, ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి తన పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. మొదటి పాటలోని హై ఎనర్జీ, యాక్షన్ మూడ్‌కు భిన్నంగా ఇప్పుడు మేకర్స్ రెండో పాట ‘ఏనాటి వరమో నువ్వు’ను రిలీజ్ చేశారు. చక్కని మెలోడీతో పాటు భావోద్వేగాలతో ఈ పాట వినేవారిని ఆకట్టుకుంటోంది.

జేక్స్ బిజోయ్ ఈ పాటకు మంచి మెలోడీని అందించారు. వినసొంపైన ట్యూన్‌తో పాటు భావోద్వేగాలు కలిసేలా కంపోజ్ చేశారు. కృష్ణ తేజస్వి తన వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. రెహమాన్ రాసిన లిరిక్స్ ఒక తండ్రికి తన కూతురిపై ఉండే నిస్వార్థమైన ప్రేమను, ఆప్యాయతను చక్కగా తెలియజేస్తున్నాయి. జీవితంలో అత్యంత స్వచ్ఛమైన, విలువైన బంధాల్లో ఒకటైన తండ్రి, కూతుళ్ల అనుబంధాన్ని ఈ పాట చాలా అందంగా చూపిస్తుంది. పాటలోని ఆప్యాయత, అమాయకత్వం, భావోద్వేగాలు వినేవారిని వెంటనే కనెక్ట్ చేస్తాయి.

ఈ పాటలో మైసా చిన్నప్పటి రోజులను చూపించారు. ఆమె వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచే ధైర్యంగా, సాహసాలు చేయడానికి ఇష్టపడే అమ్మాయిగా మైసాను చూపించారు. వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయం చేయడం, చెట్లు ఎక్కడం వంటి పనులతో ఆమె చురుకుదనం కనిపిస్తుంది. తండ్రిపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రతి సన్నివేశంలోనూ తెలుస్తుంది. ఆయనపై తనకున్న ప్రేమకు గుర్తుగా టాటూ వేయించుకోవాలనుకోవడం కూడా ఈ పాటలోని ఓ ప్రత్యేకమైన సందర్భం.

రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో సముద్రఖని, ఈశ్వరీ రావు నటించారు. ఈ భావోద్వేగ సన్నివేశాలకు వీరిద్దరి నటన మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. మొదటి పాటలో పరిచయం చేసిన యాక్షన్ ప్రపంచానికి భిన్నంగా, ‘ఏనాటి వరమో నువ్వు’ పాట తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం ద్వారా కథలోని ఎమోషనల్ బేస్‌ను పరిచయం చేస్తుంది.

ఈ రెండో పాటతో ‘మైసా’లో మరో కొత్త కోణాన్ని మేకర్స్ ప్రేక్షకులకు చూపించారు. మొదటి పాటలోని పవర్‌ఫుల్ యాక్షన్ మూడ్‌కు భిన్నంగా, ఈసారి ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్నారు. మంచి మెలోడీ, లిరిక్స్, కుటుంబ అనుబంధాన్ని చూపించే సన్నివేశాలు ఈ పాటను వెంటనే నచ్చేలా చేస్తున్నాయి. అదే సమయంలో సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

Also Read:ఆ పాదయాత్ర ఓ గొప్ప జ్ఞాపకం..కేటీఆర్!

ఈ సినిమాకు శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా ఈ సినిమాలో స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.

‘మైసా’ నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రిలీజ్ కానుంది.

- Advertisement -