ఏపీకి అక్వాన్ తుఫాన్ ముప్పు

2
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి అక్వాన్ (Akvan) తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ క్రమంగా బలపడుతూ తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు నుంచి తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని తెలిపింది.

తుఫాన్ ప్రభావంతో బుధవారం నుంచి కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీవ్రతను బట్టి వర్షాలు, గాలుల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌తో పాటు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు తాజా హెచ్చరికల్లో పేర్కొంది.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలను సిద్ధం చేస్తోంది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అత్యవసర సహాయక చర్యలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా, రహదారులు, పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

మరోవైపు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -