2026 సంవత్సరానికి ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిలిప్పీన్స్.. మనీలాలో 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం (EAS) నిర్వహిస్తోంది. ఈ రెండు కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లో పర్యటిస్తున్నారు.
ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. మంగళవారం జరిగే 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సమావేశం, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
మనీలాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చారిత్రాత్మక గురుద్వారా ఖాల్సా దివాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గురుద్వారా పునరాభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఫిలిప్పీన్స్‌లో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పురాతన గురుద్వారాగా ఖాల్సా దివాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ సిక్కు సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటమే కాకుండా, ఫిలిప్పీన్స్ సమాజంతో భారతీయుల అనుబంధాన్ని పెంపొందించడంలోనూ ఈ గురుద్వారా కీలక పాత్ర పోషిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా ఇది ముఖ్యమైన కేంద్రంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ తన కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read:సిద్దిపేటపై రేవంత్ కక్ష సాధింపు!

