2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక అడుగు వేసింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో సీట్ల సర్దుబాటు చర్చల్లో భాగంగా 181 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను కాంగ్రెస్ పార్టీ పంపించింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి ఈ జాబితాను అందజేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి.
కాంగ్రెస్ ప్రతిపాదించిన 181 స్థానాల్లో 135 జనరల్ నియోజకవర్గాలు ఉండగా.. 45 స్థానాలు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు రిజర్వ్ అయ్యాయి. మరో స్థానం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు కేటాయించారు.
ఈ జాబితాలో బాగ్‌పత్, లోని, బులంద్‌షహర్, మథుర, ఆగ్రా రూరల్, ఫతేపూర్ సిక్రీ, పిలిభిత్, షాజహాన్‌పూర్, షాహాబాద్, రాయ్‌బరేలీ, అమేథీ, కాన్పూర్ కంటోన్మెంట్ తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధత, సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన స్థానాలు, ఎస్పీతో పొత్తు చర్చలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
Also Read;రెండోసారి ICC చైర్మన్‌గా జై షా
సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు వెల్లడించారు. 2027లో జరిగే యూపీ ఎన్నికలు దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాల హక్కులకు మరింత రక్షణ కల్పించాలని ఆశిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో కలిసి ఉత్తరప్రదేశ్ ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

