ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శామ్ పిట్రోడా . వ్యక్తిగతంగా మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎంతో ఆప్యాయంగా, దయతో ఉంటారని ప్రశంసించారు. ఆయన మంచి వక్త అని కష్టపడి పనిచేస్తారని పేర్కొన్నారు. మోదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నీ కేవలం సిద్ధాంతపరమైనవేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ గతంలో ప్రధాని మోదీని గొప్ప వక్తగా అభివర్ణించిన విషయంపై ప్రశ్నించగా శామ్ పిట్రోడా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గురించి మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా.. ఆయనను వ్యక్తిగతంగా గౌరవిస్తానని పిట్రోడా సమాధానమిచ్చారు. మోదీ తనకు గుజరాతీ మిత్రుడని, ఆయనను స్వయంగా కలిశానని చెప్పారు. తన భార్యతో కలిసి మోదీని కలిసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.
మోదీ చాలా ఆప్యాయంగా, దయతో, ప్రేమగా, శ్రద్ధగా ఉంటారు. వ్యక్తిగత స్థాయిలో ఆయన ప్రవర్తన ఎంతో బాగుంటుంది. ఆయన మంచి వక్త. కష్టపడి పనిచేసే వ్యక్తి. మేమిద్దరం స్నేహపూర్వకంగానే ఉంటాం. ఆయనతో నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవు. గుజరాతీ నాయకుడిగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా మోదీపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. దాన్ని నేను అభినందిస్తాను అని పిట్రోడా పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో తనకు ఉన్న విభేదాలపై కూడా పిట్రోడా స్పష్టత ఇచ్చారు. మోదీ ప్రపంచాన్ని చూసే విధానం ఆయన సిద్ధాంతాలతో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. అయితే అవి వ్యక్తిగతంగా మోదీకి వ్యతిరేకంగా కాదని వివరించారు.
Also Read:విశాఖ వేదికగా ‘CII సదస్సు’-2026

