కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన జీవిత కథ ఆధారిత పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) ఇవాళ విడుదల కానుంది. ఇటలీలోని సాధారణ కుటుంబంలో జన్మించి, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని నెహ్రూ-గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన తన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో ఆమె వివరించారు. ప్రేమ, కుటుంబం, బాధ్యత, వ్యక్తిగత విషాదాలు, రాజకీయ జీవితం వంటి అనేక అంశాలకు ఇందులో చోటు కల్పించారు.
544 పేజీలతో రూపొందిన ఈ పుస్తకాన్ని అంతర్జాతీయంగా ఆల్ఫ్రెడ్ ఏ. నాప్ ప్రచురిస్తుండగా, భారత్‌లో హార్పర్‌కాలిన్స్ ప్రచురిస్తోంది. సోనియా గాంధీ వ్యక్తిగత జీవితంతో పాటు భారతదేశంతో ఆమెకు ఏర్పడిన అనుబంధాన్ని తెలుసుకోవాలనుకునే పాఠకులకు ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉండనుంది.
సోనియా గాంధీ తన జీవిత ప్రయాణాన్ని ఇటలీలోని బాల్యం నుంచి ప్రారంభించారు. 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో 19 ఏళ్ల సోనియా మైనోకు రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 1968లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం సోనియా భారత్‌కు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవడం, కుటుంబ బాధ్యతలు స్వీకరించడం వంటి అనుభవాలను పుస్తకంలో వివరించారు.
Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!
సోనియా జీవితంలో ఎన్నో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య వంటి ఘటనలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయి. ముఖ్యంగా భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిళ్లు ఎదురైనా కొంతకాలం ఆమె దూరంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి, సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించినప్పటికీ ప్రధాని పదవిని స్వీకరించడానికి నిరాకరించిన విషయాలను ఈ పుస్తకంలో వెల్లడించనున్నారు సోనియా.

