BB10: పదో వారం నామినేషన్లలో రచ్చ..

4
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పదో వారం నామినేషన్లు హౌస్‌లో తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఇప్పటివరకు స్నేహంగా ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా సుధీర్, ముకేశ్ మధ్య మాటల యుద్ధం, వర్షిణి ఆరోపణలు, నీతూ మాస్టర్ ఆవేశం తాజా ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. నామినేషన్ల సందర్భంగా నీతూ తన చెంపపై తానే కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

హౌస్‌లో మొదటి నుంచి స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేశ్ మధ్య ఇప్పుడు విభేదాలు మొదలయ్యాయి. సుధీర్ కెప్టెన్ కావడానికి తాను సహకరించానని, తన మద్దతు లేకపోతే అతడు కంటెండర్‌గా కూడా నిలిచేవాడు కాదని ముకేశ్ వ్యాఖ్యానించాడు. దీంతో సుధీర్ తీవ్రంగా స్పందించాడు. ముకేశ్‌ను ఉద్దేశించి గుండు సున్నా అంటూ కౌంటర్ ఇచ్చాడు. శివ సైతం ముకేశ్‌ను మబ్బేష్ అంటూ ఆటపట్టించడంతో గొడవ మరింత ముదిరింది.

మరోవైపు సుధీర్‌పై వర్షిణి తీవ్ర ఆరోపణలు చేసింది. స్నేహితులుగా ఉంటూ ఇప్పుడు ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించింది. మిత్రలాభం, మిత్రభేదం వంటి పదాలను ప్రస్తావిస్తూ మిత్రద్రోహం చేశావంటూ నిలదీసింది. రామ్ ప్రసాద్ కూడా తనపై నామినేషన్ కార్డు రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్నేహితుల మధ్య నేరుగా మాట్లాడకుండా నామినేషన్లలో విమర్శించడం ఏంటని ప్రశ్నించగా, స్నేహం ఉన్నంత మాత్రాన తప్పులను ఎత్తిచూపకుండా ఉండలేమని వర్షిణి సమాధానమిచ్చింది.

Also Read:వందేభారత్ స్లీపర్ రైళ్లలో ‘తత్కాల్’ ఉండవు!

త్రిగుణ్, నీతూ మధ్య నామినేషన్ పాయింట్ల విషయంలో వాగ్వాదం జరిగింది. మధ్యలో మాట్లాడొద్దని త్రిగుణ్ చెప్పగా, నీతూ ఎదురుదాడికి దిగింది. వంశీ జోక్యం చేసుకోవడంతో అతడితోనూ నీతూకు గొడవ మొదలైంది. త్రిగుణ్ తన కుటుంబం, గతంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రస్తావించడంతో నీతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ క్రమంలో తన చెంపపై తానే కొట్టుకుంది.మొత్తానికి పదో వారం నామినేషన్లు హౌస్‌లో స్నేహాలు, విభేదాలు, భావోద్వేగాలతో కొత్త మలుపులు తీసుకొచ్చాయి.

- Advertisement -