దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 6వ తేదీ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) 389గా నమోదైంది. దీంతో నగరంలో కాలుష్య నియంత్రణ చర్యలను అధికారులు మరింత కఠినతరం చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశ ఆంక్షలను కొనసాగిస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, గాలుల వేగం తగ్గడం వంటి కారణాలతో కాలుష్య తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనుల వల్ల ఏర్పడే దుమ్ము, ఇతర కాలుష్య కారకాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి.
కాలుష్యాన్ని తగ్గించేందుకు రహదారులపై యంత్రాల ద్వారా శుభ్రపరిచే కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. రద్దీ ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీటిని చల్లడంతో పాటు దుమ్ము నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు నిరంతరం పరిశీలించనున్నారు.
Also Read:రామాయణంపై జక్కన్న ప్రశంసలు
ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు పార్కింగ్ ఛార్జీలను పెంచడం, ప్రజా రవాణా వ్యవస్థను మరింత ప్రోత్సహించడం వంటి చర్యలు కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలను మార్చే అవకాశంతో పాటు సాధ్యమైన చోట ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తున్నారు.ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, బస్సులు వినియోగించాలని, కార్పూలింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

