రాజీనామా చేసే ప్రసక్తే లేదు:రూబియో

2
- Advertisement -

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన ప్రభుత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఎదురుదెబ్బల నేపథ్యంలో రూబియో భవిష్యత్ రాజకీయాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పుకోవచ్చనే ప్రచారం జరిగింది.

ట్రంప్ రెండో పదవీకాలం ముగిసే వరకు ఆయనకు సేవ చేయాలన్నదే తన ప్రణాళిక అని వెల్లడించారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న పనిని ఎంతో ఇష్టపడుతున్నానని తెలిపారు. అంతేకాకుండా తనకు ప్రభుత్వంలో ఉన్న పలు బాధ్యతలపై వస్తున్న ప్రశ్నలపైనా ఆయన స్పందించారు. తాను ఏ పదవిని వదులుకుంటానని ప్రచారం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం మార్కో రూబియో అమెరికా విదేశాంగ మంత్రితో పాటు జాతీయ భద్రతా సలహాదారుగా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానాలు, జాతీయ భద్రతా నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల్లో రూబియో పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఇకపై 2028 ఎన్నికల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు.

Also Read:రామాయణంపై జక్కన్న ప్రశంసలు

రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయాల నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -