కొడంగల్‌కు చెందిన గల్ఫ్ బాధితురాలు తుప్పుడు లక్ష్మి తెలంగాణకు తిరిగి వచ్చారు. ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన ఆమెను స్వదేశానికి రప్పించడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో లక్ష్మి, ఆమె కుమారుడు రాజు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు.
కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మి జీవనోపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 12న మస్కట్ వెళ్లారు. అయితే అక్కడ ఆమె ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన తల్లిని స్వదేశానికి తీసుకురావాలని ఆమె కుమారుడు రాజు పలువురు కాంగ్రెస్ నాయకులను సంప్రదించినప్పటికీ స్పందన రాలేదని తెలిపాడు. దీంతో తన తల్లి పడుతున్న బాధను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ఆయనను కలిశాడు.
రాజు పరిస్థితిని వివరించడంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. మస్కట్‌లోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి లక్ష్మిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో అక్కడి బీఆర్ఎస్ శ్రేణులు చొరవ తీసుకుని ఆమె తిరిగి వచ్చేందుకు సహకరించాయి.
Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ
స్వదేశానికి చేరుకున్న అనంతరం లక్ష్మి తన కుమారుడు రాజుతో కలిసి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో స్పందించి తనను స్వదేశానికి రప్పించేందుకు సహకరించినందుకు లక్ష్మి ధన్యవాదాలు చెప్పారు. గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజలకు అవసరమైన సహాయం అందించాల్సిన బాధ్యత ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

