అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువుల చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను పరిష్కరించింది. అయితే ఈ కేసులోని ఆరోపణల వాస్తవాలు, మెరిట్స్‌పై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది. స్థానిక న్యాయస్థానం చట్ట ప్రకారం విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను పరిష్కరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కొనసాగిస్తారని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో కొంతమంది నిందితులు నగదు, విలువైన వస్తువులను దుర్వినియోగం చేసినట్లు ఎస్ఐటీ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దుర్వినియోగం చేసిన డబ్బుతో కొందరు నిందితులు ఆస్తులు కొనుగోలు చేయగా, మరికొందరు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
Also Read:కాంగ్రెస్ ర్యాలీ.. బీఎస్-6 వాహనాల తనిఖీలు
ఈ కేసులో చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితులు న్యాయస్థానానికి సహకరించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నందున, పిటిషనర్లు కూడా విచారణ సమయంలో మేజిస్ట్రేట్‌కు సహకరించవచ్చని తెలిపింది.ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనం కూడా ఇమిడి ఉన్నందున పిటిషనర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విరాళాల చోరీ ఆరోపణలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించడం లేదని స్పష్టం చేసింది. అంటే నిందితులు దోషులా? కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మొత్తంగా రామమందిరం విరాళాల చోరీ కేసులో ఆరోపణలపై సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఎస్ఐటీ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా స్థానిక న్యాయస్థానంలో విచారణ చట్ట ప్రకారం కొనసాగనుంది.

