‘పిహు’ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు వినోద్ కప్రి మరోసారి భావోద్వేగభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం పైర్ (PYRE) నేడు థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా కథలోని భావోద్వేగాలు, వృద్ధ దంపతుల జీవితాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఉపాధి కోసం గ్రామంలోని వారంతా ఒక్కొక్కరుగా వలస వెళ్లిపోతారు. దీంతో ఆ గ్రామంలో ఓ వృద్ధ దంపతులు మాత్రమే మిగిలిపోతారు. వయసు మీద పడినా తమ ఊరిని, ఇంటిని విడిచిపెట్టలేక అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో 28 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం బాంబే వెళ్లిన తమ కుమారుడి నుంచి ఓ లేఖ వస్తుంది. అందులో ‘నేను వస్తున్నాను’ అనే సందేశం ఉంటుంది.
దీంతో ఆ వృద్ధ దంపతుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇన్నేళ్లుగా తమ కుమారుడి రాక కోసం ఎదురుచూస్తున్న వారి మనసుల్లో ఆనందం మొదలవుతుంది. ఇంతకీ ఆ కుమారుడు నిజంగానే తిరిగి వచ్చాడా? అతడి కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు నెరవేరాయా? వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ సినిమా అసలు కథ.
Also Read:జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’
సాధారణ జీవితాల్లోని ఒంటరితనం, వలసల కారణంగా ఖాళీ అవుతున్న గ్రామాలు, కుటుంబ బంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పడే ఎదురుచూపులను దర్శకుడు వినోద్ కప్రి హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించినట్లు ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తోంది.

