పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తన ప్రస్తుత నియోజకవర్గమైన ధురి నుంచి పోటీ చేయనున్నారు. అలాగే జైలులో ఉన్న పార్టీ నేత, ఎమ్మెల్యే సంజీవ్ అరోరాకు లూథియానా వెస్ట్ టికెట్ కేటాయించింది.
ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుకు సంబంధించి సంజీవ్ అరోరా గురుగ్రామ్‌లోని భోండ్సీ జైలులో ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు పార్టీ టికెట్ కేటాయించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి జాబితాలో మరికొందరు ప్రముఖ నేతలకు కూడా ఆప్ అవకాశం కల్పించింది. కోట్కపురా నుంచి కుల్తార్ సింగ్ సంధ్వాన్, అజ్నాలా నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, తల్వాండి సాబో నుంచి బల్జిందర్ కౌర్, బటాలా నుంచి అమన్‌షేర్ సింగ్ షెరీ కల్సీ, భదౌర్ నుంచి లాభ్ సింగ్ ఉగోకేలను అభ్యర్థులుగా ప్రకటించింది.
అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పంజాబ్ పార్టీ ఇన్ఛార్జ్ మనీష్ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమన్ అరోరా, రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు అభ్యర్థుల పేర్లపై చర్చించి, ఎంపిక చేసిన పేర్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తుది ఆమోదం కోసం పంపించారు.అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి, ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుకు ప్రాధాన్యత ఇస్తామని భగవంత్ మాన్ గతంలో వెల్లడించారు. గత ఐదేళ్లలో పంజాబ్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల ఆధారంగానే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు కోరుతామని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధిని ప్రధాన ఎన్నికల అంశాలుగా ప్రస్తావించారు.

