‘రామాయణం’..ప్రభంజనం

7
- Advertisement -

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన లభిస్తోంది. విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే భారత్‌లో 4 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా ప్రీ-సేల్స్ దాదాపు 3 మిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.

ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం.. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 9,050 షోలకు సంబంధించి సుమారు 4 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో బ్లాక్ చేసిన సీట్లతో కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ వసూళ్లు రూ.19.59 కోట్లకు చేరాయి. బ్లాక్ సీట్లను మినహాయిస్తే ఈ మొత్తం రూ.16.29 కోట్లుగా ఉంది. ప్రస్తుతం సినిమా ఆక్యుపెన్సీ 19 శాతంగా నమోదైంది. గతంలో 6,780గా ఉన్న షోల సంఖ్య తాజాగా 9,050కి పెరగడం సినిమాపై ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది.

మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్‌లో హిందీ వెర్షన్ ఏకంగా 83 శాతం వాటాతో ముందంజలో ఉంది. ఈ వెర్షన్ ద్వారా రూ.16.26 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. కన్నడ వెర్షన్ రూ.2.55 కోట్లతో 13 శాతం వాటాను దక్కించుకుంది. యశ్ రావణుడి పాత్రలో నటిస్తుండటంతో కర్ణాటకలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక రూ.3.88 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రూ.3.85 కోట్లతో రెండో స్థానంలో, ఢిల్లీ రూ.3.25 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

Also Read:ట్రంప్‌కు డమ్మీ అభ్యర్థి టెన్షన్!

అంతర్జాతీయ మార్కెట్లలోనూ రామాయణం దూసుకుపోతోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు 2.85 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ఉత్తర అమెరికా నుంచే 2.15 మిలియన్ డాలర్లు రావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్ సాధించే దిశగా సినిమా ప్రయాణిస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి మొదటి భాగం నవంబర్ 5న విడుదల కానుండగా రెండో భాగాన్ని 2028 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

- Advertisement -