T20:రషీద్ ఖాన్ అరుదైన రికార్డు

5
- Advertisement -

ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ తడివనాషే మరుమణిని తొమ్మిదో ఓవర్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించి 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

రషీద్ ఖాన్ తన 120వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇప్పటివరకు 200 వికెట్లు పడగొట్టిన అతడు 13.96 సగటు, 6.13 ఎకానమీతో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 171 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, హాంకాంగ్‌కు చెందిన ఎహసాన్ ఖాన్, న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధి చెరో 165 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టిమ్ సౌథీ 164 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ ఒక దశలో 38 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 50 బంతుల్లో 116 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇజాజ్ అహ్మద్‌తో కలిసి ఆరో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రషీద్ ఖాన్ కూడా చివర్లో ఆరు బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా సెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. జింబాబ్వే 202 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది.

- Advertisement -