ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగి సేవలు నిలిచిపోయాయని ఆరోపించారు. ఒకవైపు కీలకమైన ప్రభుత్వ పోర్టల్ హ్యాక్‌కు గురైతే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థల భద్రతపై దృష్టి పెట్టకుండా గ్లోబల్ సమ్మిట్లలో ఏఐ గురించి మాట్లాడితే ఎలా అని సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇంటెలిజెన్స్‌ను కాకుండా తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సమర్థంగా ఉపయోగించుకోవాలని వ్యాఖ్యానించారు. టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగి సేవలు నిలిచిపోయిన అంశంపై తాము ప్రశ్నిస్తే అధికార కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయడం పెద్ద జోక్‌గా మారిందని ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనా సంజయ్ స్పందించారు. పదేళ్లపాటు సంతోషంగా ఉన్న తెలంగాణను రెండు జాతీయ పార్టీలు నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. అటు కేంద్రంలో ఉన్న పెద్దన్న, ఇటు రాష్ట్రంలో ఉన్న చిన్నన్న కలిసి తెలంగాణను ముంచుతున్నారని విమర్శించారు.
రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే ఒకరు భిక్షాటన పేరుతో డ్రామాలు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. జుట్టు గురించి మాట్లాడటానికే ప్రజలు ఎంపీగా గెలిపించారా అని ప్రశ్నించారు. ఒక కేంద్ర మంత్రి, ఎంపీ మాట్లాడాల్సిన మాటలు అవేనా అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రైతుల సమస్యలపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:రాహుల్ వల్లే మోదీ గెలుపు!

