ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల కమిటీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు లభించగా, ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు వచ్చాయి. అరబ్ పార్టీలకు మొత్తం 19 స్థానాలు దక్కాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీని ఏ కూటమి సాధించలేకపోయింది.
ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు జరుగగా నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 27 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని యషార్ పార్టీ 21 స్థానాలను సాధించింది. బి’యాచాద్ పార్టీకి 12, జాయింట్ లిస్ట్‌కు 11, డెమోక్రాట్స్, రామ్ పార్టీలకు చెరో 8 స్థానాలు వచ్చాయి.
ఇక యిస్రాయెల్ బెటెన్యు, యునైటెడ్ తోరా జుడాయిజం, ఒట్జ్మా యెహుదిత్ పార్టీలకు చెరో 7 స్థానాలు లభించాయి. షాస్, రిలీజియస్ జియోనిజం పార్టీలకు చెరో 6 సీట్లు దక్కాయి.ఈ ఎన్నికల్లో 77.9 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 57,16,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల కాలంలో ఇదే అత్యధిక పోలింగ్‌గా నిలిచింది.
అయితే ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారిక ఫలితాలను నవంబర్ 4న అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సమర్పించనున్నారు. అనంతరం ఆయన వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నవంబర్ 10న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read:ఫోన్లు పక్కన పెట్టండి..కొత్త ట్రెండ్!

