న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుస విజయాలు సాధించడంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకమని యువ బ్యాటర్ తిలక్ వర్మ ప్రశంసించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లు, మధ్య ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనున్న నాలుగో టీ20లోనూ బౌలర్ల ప్రదర్శనే కీలకం కానుందని అభిప్రాయపడ్డాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, ఆతిథ్య న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన భారత్ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కైవసం చేసుకుంది.
గురువారం తిలక్ వర్మ మాట్లాడుతూ.. గత రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలింగ్ విభాగం సమష్టిగా అద్భుత ప్రదర్శన చేసిందని తెలిపాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్రిన్స్ యాదవ్ యార్కర్లను కచ్చితంగా సంధిస్తున్న తీరు సానుకూల అంశమని పేర్కొన్నాడు. మ్యాచ్ కీలక దశల్లో ఇలాంటి బంతులు వేయడం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందన్నాడు.
ఈడెన్ పార్క్‌లో బౌండరీలు చిన్నవిగా ఉంటాయని విన్నానని, అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే మైదానం పరిమాణం పెద్దగా ప్రభావం చూపదని తిలక్ అభిప్రాయపడ్డాడు. చిన్న బౌండరీల నేపథ్యంలో డెత్ ఓవర్లలో యార్కర్లు సంధించడం మరింత కీలకమవుతుందని చెప్పాడు.జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు. మానసికంగా ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉన్నాడని, తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నాడు. టీ20ల్లో తాము ఏర్పరచుకునే ప్రమాణాలు వన్డేలు, టెస్టుల్లోనూ జట్టుకు ఉపయోగపడతాయని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు.
Also Read:కాంగ్రెస్ పార్టీ..స్కామ్ క్యాలెండర్
నామన్ ధీర్ బౌలింగ్‌లోనూ బాగా రాణిస్తున్నాడని తిలక్ వర్మ ప్రశంసించాడు. తన బౌలింగ్‌పై కూడా జట్టు యాజమాన్యంతో చర్చలు జరిగాయని, నెట్స్‌లో సాధన కొనసాగిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం నామన్ ధీర్ బాగా బౌలింగ్ చేస్తున్నందున అతడికి అవకాశాలు ఇవ్వడం జట్టుకు ప్రయోజనకరమని చెప్పాడు. తనకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని తిలక్ స్పష్టం చేశాడు.

