ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్‌ పంజా..

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌పై అర్నాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యానాం సమీపంలో తీరం దాటే సమయంలో తుపాను ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా. విశాఖపట్నం నుంచి బాపట్ల వరకు తుపాను ప్రభావం కనిపించింది. తీర ప్రాంతాల్లో ప్రచండ గాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనూ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నంలో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం.

Also Read;షారుఖ్ ‘కింగ్‌’ కాపీనా?

పశ్చిమగోదావరి జిల్లాపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. రహదారులపై పడిపోయిన చెట్లను సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం కూడా భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

- Advertisement -