కాలిన గాయాలతో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అండగా నిలుస్తూ, వారికి పునరావాసం కల్పించేందుకు నిహారి మండలి చేస్తున్న ప్రయత్నం ఎంతో గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. బాధితులకు ఉచితంగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు అందించడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆమె చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి, ఆమె చేస్తున్న సేవలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మంగళవారం తెలంగాణ భవన్లో నిహారి మండలి కేటీఆర్‌ను కలిసి, తాను స్థాపించిన బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ (BSMS) ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ‘బర్న్స్ టు షైన్–2026’ కార్యక్రమం లక్ష్యాలను, కాలిన గాయాల బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం, కౌన్సెలింగ్ సేవల గురించి వివరించారు. సమాజంలో కాలిన గాయాల బాధితులు ఎదుర్కొంటున్న వివక్ష, ఆత్మన్యూనత భావం వంటి సమస్యలను అధిగమించేందుకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
2009లో తీవ్ర కాలిన గాయాలకు గురైన నిహారి మండలి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన శస్త్రచికిత్సలు చేయించుకోలేకపోయారు. ఆ సమయంలో జర్మనీ నుంచి వచ్చిన వైద్యుల సహకారంతో ఉచితంగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. తాను ఎదుర్కొన్న కష్టాలు మరెవరూ ఎదుర్కోకూడదన్న సంకల్పంతో 2014లో బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్‌ను స్థాపించారు.
ఈ సంస్థ ద్వారా వివిధ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) సంస్థల సహకారంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు నిహారి మండలి తెలిపారు. అలాగే, కాలిన గాయాల బాధితులకు ఇప్పటివరకు 1,600కు పైగా కౌన్సెలింగ్ సేవలు అందించినట్లు వివరించారు. మహిళలతో పాటు పురుషులు, చిన్నారులకు కూడా ఈ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ రాష్ట్రాల్లో కాలిన గాయాల బాధితులకు సరైన అవగాహన లేకపోవడం, ఖరీదైన వైద్య చికిత్సలను భరించలేకపోవడం వల్ల అనేకమంది అవసరమైన చికిత్సలకు దూరమవుతున్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ‘బర్న్స్ టు షైన్–2026’ కార్యక్రమం ద్వారా అర్హులైన బాధితులను గుర్తించి, వారికి ఉచిత పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

పెగాసిస్టమ్ సంస్థ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం కింద ఉచిత శస్త్రచికిత్సల కోసం అక్టోబర్ 31 వరకు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కాలిన గాయాల బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ కోరింది. మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ల కోసం 7680974918 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
కాలిన గాయాల బాధితులకు వైద్య సహాయం అందించడంతో పాటు, వారిపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో నిహారి మండలి చేస్తున్న కృషికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇటువంటి మానవీయ సేవా కార్యక్రమాలకు సమాజం నుంచి మరింత ప్రోత్సాహం, సహకారం అందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read:షారుఖ్ ‘కింగ్’ కాపీనా?

