కరోనా మహమ్మారి సమయంలోనూ రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యుత్ సరఫరా పరిస్థితిపై ప్రభుత్వ తీరును విమర్శించారు.
కరోనా ప్రారంభమైన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 10 వేల మెగావాట్లుగా ఉండేదని జగదీష్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఒక్కసారిగా మరో 3,800 మెగావాట్ల డిమాండ్ పెరిగినప్పటికీ, విద్యుత్ అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించారని పేర్కొన్నారు. కరోనా భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ విద్యుత్ సిబ్బంది తమ విధులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పనిచేసిన అధికారులను అభినందించాల్సింది పోయి, ప్రస్తుతం ప్రభుత్వం వారిపై చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు అధికారులను సస్పెండ్ చేయడం, మెమోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
Also Read:రీమేక్‌కు నో.. సొంత కథతో వచ్చా!
విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్న జగదీష్ రెడ్డి…ప్రస్తుత ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవడం కంటే సమస్యలకు కారణాలను గుర్తించి పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

