రీమేక్‌కు నో.. సొంత కథతో వచ్చా!

5
- Advertisement -

ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలంటే కథలో కొత్తదనం ఉండాలని బాలీవుడ్‌ దర్శకుడు అభిషేక్‌ పాఠక్‌ అభిప్రాయపడ్డారు. విజయవంతమైన దృశ్యం ఫ్రాంచైజీలో మూడో చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో మలయాళ కథను యథాతథంగా అనుసరించకుండా తనదైన శైలిలో కథను రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

దృశ్యం 2 విడుదలైన తర్వాత తదుపరి భాగానికి సంబంధించిన కథను తానే రాయాలని అనుకున్నట్లు అభిషేక్‌ పాఠక్‌ తెలిపారు. మలయాళంలో రూపొందుతున్న మూడో భాగంతో తమ కథను పోల్చి చూసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం కంటే, ముందుగా తన ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను సిద్ధం చేయడానికి సుమారు రెండేళ్లు పట్టిందని వెల్లడించారు.

తాను సిద్ధం చేసిన కథను అజయ్‌ దేవగణ్‌తో పాటు చిత్ర బృందంలోని ఇతరులకు వివరించగా అందరికీ నచ్చిందని తెలిపారు. దీంతో అదే కథతో ముందుకు వెళ్లాలనే నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన పాత్రలతోనే కొత్తదనాన్ని చూపించడం ఈ చిత్ర నిర్మాణంలో ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్నారు.

దృశ్యం తొలి రెండు భాగాలు మలయాళ చిత్రాలకు దగ్గరగా ఉండగా మూడో భాగంలో మాత్రం భిన్నమైన కథనాన్ని ఎంచుకున్నారు. కేవలం రీమేక్‌ అనే గుర్తింపుతోనే సినిమా గురించి మాట్లాడకుండా దర్శకుడిగా తన సృజనాత్మకతకు కూడా గుర్తింపు రావాలని అభిషేక్‌ కోరుకున్నారు. అందుకే అసలు కథలోని ఉత్కంఠ, భావోద్వేగాలను కొనసాగిస్తూనే కథను కొత్త దిశలో తీసుకెళ్లినట్లు వివరించారు.

Also Read:Delhi AQI..అప్‌డేట్

దృశ్యం: ది కన్‌క్లూజన్‌ పేరుతో హిందీ ఫ్రాంచైజీకి ముగింపు ఇవ్వాలని  నిర్ణయించామని కథను అనవసరంగా పొడిగిస్తూ మరో భాగం తీసుకురావడం కంటే ప్రేక్షకులకు తృప్తినిచ్చే ముగింపు ఇవ్వడం ముఖ్యమని  భావించినట్లు తెలిపారు. అందుకే దృశ్యం 3గా మొదలైన ఈ చిత్రానికి ‘ది కన్‌క్లూజన్‌’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.

- Advertisement -