భారత ఎన్నికల సంఘంలో సీనియర్ అధికారి పనితీరుపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. ఎన్నికల సంఘంలోని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ వ్యవహారశైలిపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ కార్యదర్శి నిరాకరించినట్లు ఆర్టీఐ సమాధానంలో వెల్లడైంది.
2026 జూలై 29న ఇద్దరు కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శికి వేర్వేరుగా లేఖలు రాసినట్లు ఆర్టీఐ పత్రాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 2, 2024 నుంచి కేంద్ర నియామకాల కమిటీ ద్వారా ఎన్నికల సంఘంలో నియమితులైన ఐఏఎస్ అధికారి మనీష్ గార్గ్ పనితీరుపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (పరిపాలన)కు లింక్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనీష్ గార్గ్ తనకంటే సమాన స్థాయి, సీనియర్ అధికారుల విధులను పునర్విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఇద్దరు కమిషనర్లు ఆరోపించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘంతోగానీ, సంబంధిత అధికారులతోగానీ చర్చించలేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఎన్నికల సంఘం ముందస్తు చర్చ లేదా అనుమతి లేకుండా ఇలాంటి మార్పులు చేయవద్దని గతంలో పలుమార్లు మౌఖికంగా, లిఖితపూర్వకంగా సూచించినప్పటికీ వాటిని పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిపాలన విభాగం నుంచి సంబంధిత ఫైల్‌ను కోరినప్పటికీ తనకు అందించలేదని వివేక్ జోషి ఆరోపించినట్లు పత్రాలు వెల్లడించాయి.
ఈ ఫిర్యాదులపై ఆగస్టు 3న రూపొందించిన క్యాబినెట్ నోట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిప్రాయాన్ని కోరాలని సూచించినట్లు ఆర్టీఐ పత్రాలు తెలిపాయి. అయితే, ఆగస్టు 4న రూపొందించిన మరో నోట్లో ఎన్నికల సంఘం మొత్తంగా అధికారికంగా ఫిర్యాదు చేయనప్పుడు ఇద్దరు కమిషనర్ల వ్యక్తిగత లేఖల ఆధారంగా చర్యలు తీసుకోవడం సముచితం కాకపోవచ్చని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, దాని స్వతంత్రతను కాపాడేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం నుంచి రక్షణ కల్పించబడిందని క్యాబినెట్ నోట్లో వివరించారు. ఇద్దరు కమిషనర్ల లేఖలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వాటిని మొత్తం ఎన్నికల సంఘం అధికారిక అభిప్రాయంగా పరిగణించలేమని పేర్కొన్నారు.
Also Read:కిరణ్ అబ్బవరం..’భజ గోవిందం’
మనీష్ గార్గ్ చర్యలు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన 2023 చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని సంధు, జోషి ఆరోపించారు. ఈ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం సాధ్యమైనంతవరకు ఎన్నికల సంఘం వ్యవహారాలను ఏకాభిప్రాయంతో నిర్వహించాలని, అభిప్రాయ భేదాలు తలెత్తితే మెజారిటీ నిర్ణయం ఆధారంగా పరిష్కరించాలని క్యాబినెట్ నోట్లో ప్రస్తావించారు.
అధికారి ప్రవర్తనను ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పర్యవేక్షించి నియంత్రించాల్సిన అవసరం ఉందని కూడా నోట్ పేర్కొంది. ఫిర్యాదులపై తీసుకున్న నిర్ణయాన్ని భవిష్యత్తులో సంబంధిత అధికారి విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకునేందుకు రికార్డుల్లో ఉంచాలని సూచించారు. క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ 2026 ఆగస్టు 5న ఇద్దరు కమిషనర్ల లేఖలు అందినట్లు ధ్రువీకరించారు. వాటి ప్రతులను సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ), ఎస్టాబ్లిష్మెంట్ అధికారికి, ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి పంపించారు.

