ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగరేయండి) యాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రకు సంబంధించి న్యూఢిల్లీ ప్రాంతంలో 6,000 మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బందిని, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 220 కంపెనీలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా సీసీటీవీ నిఘాను విస్తరించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేని ప్రాంతంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో న్యాయ కస్టడీలో ఉన్న సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ యాత్రకు పిలుపునిచ్చింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జాతీయ జెండాలతో సెంట్రల్ పార్క్, కన్నాట్ ప్లేస్ ప్రాంతాలకు చేరుకుని యాత్రలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఓటు హక్కును కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోలేమని దీప్కే అన్నారు. రాజకీయ సిద్ధాంతాలు, విభేదాలను పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని సీజేపీ ఆరోపిస్తూ నిరసనలు చేపడుతోంది.
Also Read:కాంగ్రెస్ అరాచకం..రాజ్‌నాథ్ ఫైర్
యాత్ర నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను మూసివేశారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, తగిన ప్రదేశంలో ఎంపిక చేసిన కొంతమంది జాతీయ జెండాను ప్రదర్శించేందుకు, జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.

