దుబాయ్‌ బతుకమ్మ వేడుకలకు బీఆర్‌ఎస్‌ బృందం

3
- Advertisement -

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్న రెండు ప్రత్యేక బతుకమ్మ వేడుకలకు బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. Emirates Telangana Cultural Association (ETCA), Gulf Telangana Federation (GTF) ప్రతినిధులు చేసిన ఆహ్వానాల మేరకు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బృందం ఈ వేడుకల్లో పాల్గొననుంది.

ETCA ప్రతినిధులు గత నెలలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ఆహ్వానించారు. అదే విధంగా Gulf Telangana Federation (GTF) కూడా తమ ఆధ్వర్యంలో నిర్వహించే “GTF Bathukamma Sambaraalu 2026” కార్యక్రమానికి కేటీఆర్‌ను ఆహ్వానించింది. రెండు సంస్థల ఆహ్వానాలను స్వీకరించిన కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల బృందం ఈ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.

అక్టోబర్‌ 11, ఆదివారం దుబాయ్‌లోని శబాబ్‌ అల్‌ అహ్లీ స్పోర్ట్స్‌ క్లబ్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ETCA ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.

అదే రోజు GTF ఆధ్వర్యంలో “GTF Bathukamma Sambaraalu 2026” కార్యక్రమం అల్‌ ఖుసైస్‌లోని అమిటీ స్కూల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మను ఎడారి దేశమైన దుబాయ్‌లో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు కార్యక్రమాల్లోనూ దుబాయ్‌లోని తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

Also Read:ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా?

ఈ వేడుకల్లో వేముల ప్రశాంత్‌ రెడ్డి (బాల్కొండ ఎమ్మెల్యే), కల్వకుంట్ల సంజయ్‌ కుమార్‌ (కోరుట్ల ఎమ్మెల్యే), బాజిరెడ్డి గోవర్ధన్‌ (మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్‌ రూరల్‌), ఆశన్నగారి జీవన్‌ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్‌), బిగాల గణేష్‌ గుప్తా (మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్‌ అర్బన్‌), సురేందర్‌ (మాజీ ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి), షకీల్‌ అహ్మద్‌ (మాజీ ఎమ్మెల్యే, బోధన్‌) తదితరులు పాల్గొననున్నారు.

ఒకే రోజు దుబాయ్‌లో రెండు వేదికలపై జరిగే బతుకమ్మ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల బృందం పాల్గొనడం ద్వారా ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి పండుగ సంబరాల్లో భాగస్వామ్యం కానుంది.

- Advertisement -