కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే?

4
- Advertisement -

వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన తర్వాత అధిక కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు వైద్యులు సూచించే స్టాటిన్ మందులు ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ.. మందులతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ముందుగా తమ మొత్తం గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయించుకోవాలి. కేవలం కొలెస్ట్రాల్ సంఖ్యను చూసి చికిత్స నిర్ణయించకుండా.. రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, పొగతాగడం, గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ నియంత్రణలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అధికంగా సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆహారాన్ని తగ్గించి.. కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, గింజలు వంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. బరువు అధికంగా ఉంటే క్రమంగా తగ్గించుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నడక వంటి మితమైన వ్యాయామాన్ని వయసు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా కొనసాగించడం మంచిది.అలాగే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. కుటుంబంలో చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చిన చరిత్ర ఉంటే.. వైద్యుడితో అదనపు గుండె సంబంధిత పరీక్షల అవసరంపై చర్చించాలి.

Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

ముఖ్యంగా 65 ఏళ్ల వయసులో కొలెస్ట్రాల్‌కు సంబంధించిన మందులను సొంతంగా ప్రారంభించడం లేదా నిలిపివేయడం చేయకూడదు. వయసు మాత్రమే కాకుండా వ్యక్తి మొత్తం గుండె ఆరోగ్యం, ఇతర అనారోగ్యాలు, ప్రస్తుతం తీసుకుంటున్న మందులు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత వైద్యుడు సరైన చికిత్సను నిర్ణయిస్తారు.

- Advertisement -