ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో జరిగిన సంచలనాత్మక ఘటన దర్యాప్తులో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఎఫ్‌జడ్ 1073 (FZ1073) విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించి, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసిన కో-పైలట్‌ను 29 ఏళ్ల హమామ్ అల్ హమ్మామీ గా గుర్తించారు.
ఈ తీవ్ర భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్న ప్రధాన అంశాలు: ఒమన్ ఎయిర్‌లో తీవ్రవాద కంటెంట్ గుర్తించి వేటు 2024 ప్రాంతంలో హమామ్ అల్ హమ్మామీ ఒమన్ ఎయిర్ (Oman Air) సంస్థలో ట్రైనీ కో-పైలట్‌గా పనిచేశాడు. హమామ్ తీవ్రవాద వెబ్సైట్లను సందర్శిస్తున్నట్లు, అతడి వద్ద ఎక్స్ట్రీమిస్ట్ (తీవ్రవాద) మెటీరియల్ ఉన్నట్లు ఒమన్ అధికారులు గుర్తించారు. భద్రతా ముప్పుగా భావించి అతడిని విమానాలు నడపకుండా నిరోధించి, కార్యాలయ (అడ్మినిస్ట్రేటివ్) విధులకు పరిమితం చేశారు. అనంతరం అతడు ఆ సంస్థకు రాజీనామా చేశాడు.
ఫ్లైదుబాయ్‌లో నియామకంపై ప్రశ్నలు తీవ్రవాద భావజాలం ఉన్నట్లు గతంలోనే గుర్తించిన వ్యక్తి ఫ్లైదుబాయ్‌లో ఫస్ట్ ఆఫీసర్‌గా (Co-Pilot) ఎలా చేరగలిగాడనే దానిపై ఇంటెలిజెన్స్ సంస్థలు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి.అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో కఠినమైన సెక్యూరిటీ క్లియరెన్స్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియలను దాటుకుని అతడు ఉద్యోగం ఎలా సంపాదించాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని పౌరులపై నిబంధనలు ఉండగా, టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలోనే అతడికి డ్యూటీ ఎలా కేటాయించారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
సంఘటన జరిగిన కొద్ది గంటలకే హమామ్ సోషల్ మీడియా ఖాతా (లింక్డ్ఇన్)లో కొన్ని అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమవడం అధికారుల దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది.విమానం కాక్‌పిట్ వీడియోలతో పాటు అల్ ఖైదా మాజీ అధిపతి ఐమన్ అల్ జవాహిరి చిత్రాలు అందులో ఉన్నాయి. ఈ దాడి ఏదైనా ఉగ్రవాద సంస్థ ఆదేశాల మేరకు జరిగిందా, లేదా హమామ్ సొంతంగా ఈ కుట్ర పన్నాడా అనే కోణంలో యూఏఈ, అంతర్జాతీయ నిఘా వర్గాలు విచారిస్తున్నాయి. సాహసంతో కాపాడిన భారతీయ కెప్టెన్ కాక్‌పిట్‌లో హమామ్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అత్యంత సాహసంతో కాక్‌పిట్ తలుపులు తెరిచారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి హమామ్ను అదుపులోకి తీసుకున్నారు. 174 మంది ప్రయాణికులున్న ఈ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Also Read:‘మరకతమణి 2’..షూటింగ్ పూర్తి

