బిగ్ బాస్ హౌస్‌లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే. గెలుపు ఖాయం అనుకున్న చోట కూడా ఒక్క నిర్ణయం మొత్తం పరిస్థితిని మార్చేస్తుంది. తాజాగా శుక్రవారం ఎపిసోడ్‌లో ఇదే జరిగింది. కెప్టెన్సీ టాస్క్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించిన అమన్.. చివరకు కెప్టెన్ కాలేకపోయాడు. వర్షిణి తనకు లభించిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించడంతో అమన్‌కు వచ్చిన కెప్టెన్సీ అవకాశం చేజారిపోయింది.
కెప్టెన్సీ కంటెండర్ల ఎంపికతో ఎపిసోడ్ ప్రారంభమైంది. రెడ్ టీం నుంచి ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ పోటీలో ఉండాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యులు తమ వద్ద ఉన్న డ్యాగర్స్ ఆధారంగా వ్యూహాలు రచించడం మొదలుపెట్టారు. కొందరు డ్యాగర్స్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తే.. మరికొందరు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచేందుకు వాటిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో అమన్ కూడా సుధీర్, వర్షిణి, ముఖేష్‌తో చర్చలు జరిపాడు. రెండు డ్యాగర్స్ ఇస్తే తనకు కెప్టెన్సీ కంటెండర్ అవకాశం ఇవ్వాలని ఒప్పందానికి వచ్చాడు. అయితే రోహిత్, షాలినీ, అపూర్వ తదితరులు అమన్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితమవుతున్నాడంటూ అతడికి సూచనలు చేశారు. దీంతో అమన్ మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడు.
చివరకు వర్షిణి, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ, అమన్ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీదారులుగా నిలిచారు. మూడు దశల్లో జరిగిన ఈ పోటీలో మొదటి రౌండ్‌లో అపూర్వ, వర్షిణి వెనక్కి తగ్గారు. రెండో దశలో రామ్ ప్రసాద్ ఆగిపోగా.. చివరి రౌండ్‌లో అమన్, ఝాన్సీ మధ్య పోటీ జరిగింది. వేగంగా టాస్క్ పూర్తి చేసిన అమన్ విజేతగా నిలిచాడు.
అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. వర్షిణి తనకు ఉన్న ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్‌ను ఉపయోగించింది. దీంతో అమన్ గెలుచుకున్న కెప్టెన్సీని వర్షిణి తన ఖాతాలో వేసుకుంది. ఈ నిర్ణయంతో అమన్‌తో పాటు అగ్నిపరీక్ష టీం సభ్యులు కూడా షాక్‌కు గురయ్యారు. తనకు ఈ వారం కెప్టెన్సీ చాలా ముఖ్యమని చెబుతూ వర్షిణి అమన్‌కు క్షమాపణ చెప్పింది.
Also Read:‘మరకతమణి 2’..షూటింగ్ పూర్తి
ఆ తర్వాత డ్యాగర్స్ ఆధారంగా ఇమ్యూనిటీ ఛాలెంజ్‌కు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. సుధీర్, శ్రిష్టి, వంశీ తమ వద్ద ఉన్న డ్యాగర్స్ వివరాలను వెల్లడించారు. చివరకు వంశీ, సుధీర్‌లకు ఇమ్యూనిటీ దక్కింది. దీంతో వారిద్దరూ నేరుగా ఆరో వారంలోకి వెళ్లారు. ఈ పరిణామంతో వారి టీమ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

