బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఐఫిల్ టవర్ మరియు ఈకోల్ మిలిటైర్ల నేపథ్యంతో పారిస్‌లోని ‘ప్లేస్ జోఫ్రే’ వేదికగా జరిగిన ‘లోరియల్ పారిస్ (L’Oréal Paris) లే డెఫిలే’ ఫ్యాషన్ షో ముగింపులో (ఫినాలే వాక్) ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్లో ఐశ్వర్య పాల్గొనడం ఇది తొమ్మిదోసారి కావడం విశేషం.
ఈ ఫినాలే వాక్ కోసం ఐశ్వర్యారాయ్ సిరియన్ లగ్జరీ లేబుల్ ‘యారా షూమేకర్’ ఫాల్ 2026 కుటుర్ కలెక్షన్ నుండి ప్రత్యేకంగా రూపొందించిన కస్టమ్ డ్రెస్‌ను ధరించారు. నల్లటి వెల్వెట్ గౌన్, దానికి అమర్చిన త్రీ-డి ఫ్రింజ్ డీటైలింగ్ ఆమె వేసే ప్రతీ అడుగులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అయితే ఈ డ్రెస్ మొత్తంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆమె ధరించిన వెల్వెట్ కేప్ (Cape). ముత్యాలు, స్పటికాలతో నిండిన ఈ కేప్, నక్షత్ర మండల మెరుపులతో ఆమె నడుస్తుంటే వెలుగులు విరజిమ్మింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ఈ లుక్కు జోడీగా వజ్రాల కిరీటం, డైమండ్ రింగ్స్ మరియు మ్యాచింగ్ పంప్స్‌ను అందించారు.
తనదైన శైలికి కట్టుబడి, ఐశ్వర్యారాయ్ మేకప్‌ను ఎంతో సరళంగా ఉంచుకుని, డిజైనర్ గౌన్ మరియు కేప్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె రాచరికపు నడకతో ర్యాంప్ వాక్‌ను “లార్జర్ దాన్ లైఫ్” (ప్రమాణాలకు మించి) అనిపించేలా చేయడమే తమ ఉద్దేశమని స్టైలిస్ట్ మోహిత్ రాయ్ తెలిపారు.
Also Read:సిరిసిల్ల క్రికెటర్ అక్షరకు కేటీఆర్ అండ
ఈ ర్యాంప్ వాక్‌లో ఐశ్వర్యతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు, లోరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్లు అయిన కేండల్ జెన్నర్, సిమోన్ ఆష్లే, సెలైన్ డియోన్ తదితరులు పాల్గొనడం ఈ వేడుకకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్ లుక్కు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ వేదికపై భారతీయ నటి సాధిస్తున్న ఈ ఆధిపత్యాన్ని అభిమానులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు.

