బుల్లెట్ ట్రైన్ కోసం 1000 ఎకరాలా?

1
- Advertisement -

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కునేందుకు కుట్రలు చేస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలని, వందలాది ఎకరాలను సేకరిస్తూ రైతులను రోడ్డున పడేయడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతాల్లో జరుగుతున్న భూసేకరణ తీరుపై కార్తీక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రపంచంలో ఎక్కడైనా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ఒకేచోట 1000 ఎకరాలు సేకరిస్తారా? పేద రైతుల భూములపై కన్నేసిన ప్రభుత్వం.. పక్కనే ఉన్న బడా నాయకుడు కేఎల్ఆర్ (KLR) భూములను ఎందుకు వదిలేసింది? బుల్లెట్ ట్రైన్ మార్గం కేఎల్ఆర్ భూముల గుండా పోదా? కేవలం రైతుల భూముల నుంచే పోతుందా? అని నిలదీశారు.

భూసేకరణ పరిమితి: తాము బుల్లెట్ ట్రైన్ అభివృద్ధి ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, కానీ ప్రాజెక్ట్ నిర్మాణాకి సాంకేతికంగా ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల పొలాలను లాక్కోవద్దని డిమాండ్ చేశారు. భూసేకరణను నిరసిస్తున్న రైతులపై ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తోందని కార్తీక్ రెడ్డి ఆరోపించారు.

ఎక్కడ లేని విధంగా ఏకంగా 4000 మంది పోలీసులను రంగంలోకి దించి.. నిరసన తెలుపుతున్న ఊళ్లకు ఊళ్లనే అరెస్ట్ చేశారు. మరోవైపు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వచ్చి ‘అక్రమార్కుల నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నాం అని వ్యాఖ్యానిస్తున్నారు. రక్తం ఓడ్చి సాగు చేసుకుంటున్న మా పేద రైతులు మీకు అక్రమార్కుల్లా కనిపిస్తున్నారా?” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

ప్రభుత్వ అణచివేతకు భయపడేది లేదని, బాధితులైన బహదూర్‌గూడ రైతుల తరఫున తాము హైకోర్టును ఆశ్రయించి స్టే/రక్షణ (Relief) తీసుకువచ్చామని కార్తీక్ రెడ్డి వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజాక్షేత్రంలోనూ, చట్టపరంగానూ ఎండగడతామని స్పష్టం చేశారు.

- Advertisement -