తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో తన వీరత్వంతో, ఆత్మగౌరవ పోరాటంతో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు చిట్యాల (చాకలి) ఐలమ్మ అని కొనియాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజాం నిరంకుశ పాలనకు, జమీందారీ వెట్టిచాకిరీ వ్యవస్థకు ఎదురొడ్డి నిలిచిన తొలి భూపోరాట నిప్పుకణిక ఆమె. భావితరాలకు ఐలమ్మ గారి త్యాగం, ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం అన్నారు.
వరంగల్ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని మల్లంపల్లికి చెందిన ఐలమ్మ, పాలకుర్తిలో తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసేది. నాడు విస్నూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అనే దొర ఆక్రమణలకు, అన్యాయాలకు అడ్డుకట్ట వేస్తూ తన భూమి హక్కుల కోసం ఆమె జరిపిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రధాన నాందిగా నిలిచింది. ఆంధ్ర మహాసభ తోడ్పాటుతో దొరల గుండాలను, పోలీసులను ధైర్యంగా ఎదుర్కొని తన పంటను దక్కించుకున్న ధీరత్వ ఆమెది.
నా భూమిపై పండిన పంటను దొరలకు ఎలా ఇస్తాను?” అని నినదించి దొరల గుండెల్లో నిద్రపోయిన తిరుగుబాటుదారులు ఐలమ్మ అని కొనియాడారు కేటీఆర్. తెలంగాణ సమాజం కోసం, బహుజన హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ తగిన రీతిలో గౌరవించడం జరిగింది అన్నారు.
ఐలమ్మ విప్లవ స్ఫూర్తిని, పోరాట చరిత్రను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ పాఠ్యపుస్తకాల్లో ఆమె జీవిత చరిత్రను చేర్చింది. పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు “చిట్యాల ఐలమ్మ మార్కెట్ యార్డు”గా పేరు పెట్టారు. ఐలమ్మ జయంతి మరియు వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
Also Read:Asian Games:భారత్కు మరో పసిడి

