కన్నడ నటుడు దర్శన్ తో పాటు రేణుకాస్వామి దారుణ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా (A1) ఉన్న నటి పవిత్రా గౌడ (Pavithra Gowda) జైలులో తనకు ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులపై కోర్టును ఆశ్రయించారు. జైలులో తనను నైజీరియన్ మహిళలు తీవ్రంగా వేధిస్తున్నారని, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ ఆమె పరప్పన అగ్రహార జైలు అధికారులపై మరియు తోటి ఖైదీలపై పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా 59వ సీసీహెచ్ (CCH) కోర్టు ఎదుట పవిత్రా గౌడ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.జైలులో నైజీరియన్ మహిళల వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇక్కడ రక్షణ లేదు. నాకు బెయిల్ అయినా ఇవ్వండి, లేదా ఇంత విషం ఇవ్వండి చనిపోతాను” అంటూ కోర్టు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సిట్ (SIT) తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరణ ఇచ్చారు.పవిత్రా గౌడ దాఖలు చేసిన పిటిషన్ మరియు కోర్టు ఇచ్చిన పూర్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆమె భద్రతను సమీక్షించామని తెలిపారు.వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆమెను మునుపటి బ్యారాక్ నుంచి వేరే సురక్షితమైన బ్యారాక్కు మార్చామని సీసీహెచ్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు.
ఇరువైపులా వాదనలు విన్న 59వ సీసీహెచ్ కోర్టు న్యాయమూర్తి, కేసు తదుపరి విచారణను వాయిదా వేశారు.కన్నడ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్రా గౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పవిత్రా గౌడకు అభ్యంతరకర మెసేజ్లు పంపాడనే కోపంతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్రా గౌడ గత కొన్ని నెలలుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read:ఆసియా గేమ్స్..భారత్కు మరో పతకం

