గుజరాత్‌లో జులై 31తో ముగిసిన ఒక ఏడాది కాలంలో వివిధ వ్యాధుల కారణంగా మొత్తం 62 ఆసియా సింహాలు, ఆడ సింహాలు మరియు సింహం పిల్లలు మరణించాయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజున కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ అడిగిన ప్రశ్నకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అర్జున్ మోధ్వాడియా రాతపూర్వక సమాధానమిచ్చారు.
ఏడాదిలో మరణించిన 62 జీవుల్లో 17 మగ సింహాలు, 17 ఆడ సింహాలు మరియు 28 సింహం పిల్లలు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదికల ఆధారంగా ఈ వివరాలను సేకరించారు. సెప్టిసేమియా, న్యుమోనియా, హెమరేజిక్ న్యుమోనియా, అనీమియా (రక్తహీనత), కిడ్నీ వైఫల్యం, మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండెపోటు, పక్షవాతం, ఆర్థరైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, పారాసైట్ ఇన్ఫెక్షన్లు, ఎన్సెఫాలిటిస్ వంటి పలు రకాల వ్యాధులు మరియు ఆరోగ్య సమస్యల వల్ల ఇవి మరణించాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సింహాల ఆరోగ్య పరిరక్షణకు, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టేందుకు డి-వార్మింగ్ మరియు పేను తొలగింపు కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. వ్యాధులు వ్యాపించకుండా అభయారణ్యాలు మరియు చుట్టుపక్కల గ్రామాలలోని పశువులకు టీకాలు వేయిస్తున్నారు.అత్యవసర వైద్యం కోసం ప్రత్యేకంగా ‘లయన్ అంబులెన్స్’ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు, నిఘా ఉంచేందుకు ‘వన్యప్రాణి మిత్ర’లను నియమించినట్లు పేర్కొన్నారు.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!
శసన్, జాంవాలా, జసాధర్, జునాగఢ్ సక్కర్‌బాగ్ జూ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక రెస్క్యూ కేంద్రాలు, చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.కాగా, గతంలో జరిగిన గణన ప్రకారం గుజరాత్‌లో ప్రస్తుతం 891 ఆసియా సింహాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

